Thursday, January 31, 2008

బాల్యం...

బాల్యం...
మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే అనుభూతుల పర్వం.
తెల్లవారేసరికి విరగబూసిన గన్నేరు పూలని
నేస్తాలతో పోటీపడి చలిలో ఎగిరెగిరి అందుకోవడం;
ఆ పూలలాగే ఆ జ్ఞాపకాల్నీ అందుకోవాలి.

ఆకశంలో ఎగిరే పక్షుల వరస,
వాటిలానే స్వేచ్చగా అనంతాకాశంలో తేలిపోవాలనుకున్నా...!

చల్లగాలికి నిలబడి
నీలాకాశంలోనిమేఘాల విచిత్రాకారాల గురించి
చేసిన ఓ కొలిక్కిరాని పరిశీలన.

హనుమంతుడి గుడిలో
నేస్తాలతో కలిసి రేగుపళ్ళ కోసంచేసిన హడావిడి,
ఆ అల్లరికి చుట్టుపక్కలవాళ్ళచే తిట్లు తిన్న వైనం.

ఎక్కడో ఎగిరే విమానం నడిపే పైలట్ కి చెప్పిన"టాటా''...,
మలిసంధ్యలో తొలిచుక్కకి చెప్పిన "హలో"...

బడిలో...'లెక్కలు చేయలేదేం రా...?'
అని లెక్కల మాస్టారి ట్రీట్మెంటూ,
ఇంట్లో 'చదవకపోయావో...?'అని వార్నింగులూ!
బడిచెట్లకింద వేపపల్లతోనో,రాళ్ళతోనో'
మూడు రాళ్ళాటాడటానికి పడిన అష్ట కష్టాలు,
అందుకు టీచర్ ల చేతిలోతన్నులూ ...
తో పాటూ...
నీరునిండిన చెరువులోకి గులకరాళ్ళు విసరడం...
ఇలాంటి చేదు అనుభవాల్ని విసిరేయడమేమో...?!

చిరుగాలికి అల్లాడిపోయే ఆకుని చూస్తే,
నాన్న కోపానికి భయపడి అమ్మ కొంగు చాటున
దాక్కోవటం గుర్తుకురావటం.

చెల్లాయి కోసమని,దాని చేతులకు చాలనిగాజులు తెచ్చి,
నే తెచ్చా చూడ మని అమ్మకిచ్చిన చిలిపి చిన్నతనం.

అల్లరి చిల్లరగా తిరుగుతూ ,తూనీగల్నీ,సేతాకోకచిలకల్నీ...
వేటాడి ఆనందించిన ఆకతాయితనం.

గ్రంథాలయ వారోత్సవ పాటలపోటీలోపాడి
గ్రామాధ్యక్షురాలిచే 'బహుమతి' తీసుకున్న తొలివిజయం.

ఇంగ్లిష్ లో తొలిసారిగా వచ్చిన నూటికి తొంభై మార్కులూ,
అవి అందించిన ఆత్మవిశ్వాసమూ...
ఆ రోజులు మళ్ళీ వస్తాయా...?!

1 comment: